హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఎవరికి తోచిన కార్యక్రమాలు వారు చేయాలని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కేటీఆర్ కోరారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తులు పంచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రతి కార్యకర్త ఇతరులకు సహాయపడేలా ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని తెలిపారు.
