తుకారం గేట్ ఆర్‎యూబీ దశాబ్దాల కల

తుకారం గేట్ ఆర్‎యూబీ దశాబ్దాల కల

తుకారం గేట్ చుట్టు పక్కల ప్రజల ట్రాఫిక్ సమస్యకు నేటితో ఓ పరిష్కారం లభించింది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో నిర్మించిన తుకారాం గేట్ రోడ్ అండర్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎస్సార్డీపీ కింద నిర్మించిన ఈ ఆర్‎యూబీని డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీలతో కలిసి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

‘తుకారం గేట్ ప్రజల దశాబ్దాల కల ఈ ఆర్‎యూబీ. ఈ చుట్టు పక్కల ప్రాంతాల వారందరికీ నా శుభాకాంక్షలు. రూ. 70 కోట్లకు పైగా వ్యయంగా ఈ అండర్ పాస్‎ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎస్ఆర్డీపీ కింద ఆరు వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసుకున్నాం. దశాబ్దాలుగా పెండింగ్‎లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తున్నం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు
‘2003లో నేను, కేసీఆర్ అడ్డగుట్టకు వెల్దామని తుకారాం గేట్ నుంచి వచ్చాం. ఇక్కడ మొత్తం జామ్ అయింది. వెనక్కు పోలేని పరిస్థితి. అప్పుడు స్థానిక నాయకులు మమ్మల్ని మల్కాజిగిరి నుంచి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కోసం కృషి చేస్తూనే ఉన్నాం. దీని నిర్మాణానికి 75 కోట్లు అయింది. భూసేకరణకు 45 కోట్లు ఖర్చు అయింది. ఈ బ్రిడ్జ్ చుట్టు పక్కల ప్రాంతాల వాసులకు చాలా ఉపయోగకరమైంది’ అని పద్మారావు అన్నారు.