రాష్ట్రానికి సగం ఆదాయం హైదరాబాద్ నుంచే: మంత్రి కేటీఆర్

రాష్ట్రానికి సగం ఆదాయం హైదరాబాద్ నుంచే: మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి సగం ఆదాయం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తున్నదని మంత్రి కేటీఆర్​అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శిల్పకళా వేదికలో  జరిగిన పట్టణ ప్రగతి సంబురాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్​పాలనలో దేశంలోనే తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని కేటీఆర్ అన్నారు. దీనికి కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ ​అవార్డులే నిదర్శనమన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నది ఎంత నిజమో.. పట్టణాలు దేశానికి గ్రోత్​ ఇంజిన్లు అనడం కూడా అంతే నిజమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల ఏండ్ల కాలంలో జరిగిన పట్టణీకరణకు సమానంగా రానున్న 50 ఏండ్లల్లో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలు ఉన్నాయన్నారు.

రాబోయే ఐదేండ్లల్లో తెలంగాణలోని అత్యధిక జనాభా పట్టణాల్లో నివసించబోతున్నారని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో గ్రేటర్​ హైదరాబాద్​లో రోడ్లు, లింక్​రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లో ఉన్నప్పుడు జీహెచ్​ఎంసీ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించారని మంత్రి చెప్పారు. పట్టణాలకు పట్టణ ప్రగతి కింద రూ.4,537 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.  టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.4,706 కోట్ల లోన్​లు సమీకరించి పట్టణాల్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. అర్బన్​మిషన్​భగీరథలో భాగంగా రూ.7,100 కోట్లతో  పట్టణ ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. పారిశుధ్య కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు కష్టపడి పని చేస్తుండటంతోనే పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.