హైదరాబాద్​ను టోక్యో నగరంగా మారుస్తం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్​ను టోక్యో నగరంగా మారుస్తం: మంత్రి కేటీఆర్
  • జపాన్​లో ఎక్కడా చెత్త కనిపించకపోవడం చూసి ఆశ్చర్యపోయా
  •  నగరాన్ని క్లీన్​గా ఉంచేందుకు సిటిజన్ల సహకారం కావాలి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ను జపాన్ రాజధాని టోక్యో నగరంలా అద్భుతంగా మారుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్​సిటీలో 20 వేల మంది సఫాయి కార్మికులు మాత్రమే ఉంటే ఎలా క్లీన్​గా ఉంటుందని ప్రశ్నించారు. స్వచ్ఛ హైదరాబాద్​కు జనాల సహకారం అవసరమన్నారు. ఈ నెల 16 నుంచి గ్రేటర్​లో డివిజన్ స్థాయి పాలన మొదలుకానున్న సందర్భంగా జీహెచ్​ఎంసీ డివిజన్ అధికారులతో హైటెక్స్​లో ఆయన సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయి పాలనపై వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇటీవల టోక్యో నగరానికి వెళ్లినప్పుడు ఎక్కడ చూసినా క్లీన్​గా కనిపించింది. రోడ్లు, ఫుట్​పాత్​లు నీట్​గా ఉన్నాయి. శుభ్రం చేసే సిబ్బంది ఎవరూ కనిపించలేదు.

రెండుమూడ్రోజుల పాటు చూసినా సిబ్బంది లేకపోవడంతో ఆశ్చర్యపోయా. సఫాయి కార్మికులు లేకుండా టోక్యోను ఎలా క్లీన్​గా ఉంచుతున్నారంటూ ఓ అధికారిని అడిగా. అసలు చెత్త వేస్తే కదా క్లీన్ చేయడానికి అని ఆయన బదులిచ్చారు. జపాన్​లో జనం రోడ్లపై చెత్త వేయరు. డస్ట్​ బిన్​లోనే వేస్తారు’ అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​ను సైతం టోక్యో నగరంలా క్లీన్​గా ఉంచాలని ఆయన కోరారు. ‘డివిజన్ ఆఫీసులు పెట్టాం కదా అని తెల్లారేసరికి హైదరాబాద్ క్లీన్​గా మారాలంటే అయ్యే పని కాదని నాకు కూడా తెలుసు. కాకపోతే ఆ దిశగా జనాలకు అవగాహన కల్పించాలి. డివిజన్ అధికారులు సిటిజన్లతో మమేకమై వారి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలి. భవిష్యత్​లో హైదరాబాద్ నగరం టోక్యోతో పోటీపడి ముందుకెళ్లాలి. నేను ఈ మాట అనంగానే పేపరోళ్లు కేటీఆర్ హైదరాబాద్​ను టోక్యో చేస్తానన్నడు అని రాస్తారు. రేపే అలా చేస్తానని చెప్పడం లేదు.

అందుకు కొంత టైమ్ పడుతుంది. జనాల భాగస్వామ్యంతో అది సాకారమవుతుంది’ అని తెలిపారు. గ్రేటర్​లో ఒక డివిజన్ అంటే మున్సిపాలిటీతో సమానమైన జనాభా ఉంటుందని, కానీ ఒక మున్సిపాలిటీలో ఉన్నంత సిబ్బంది, సదుపాయాలు డివిజన్​లో లేవన్నారు. ప్రజా సమస్యలను తొందరగా పరిష్కరించేందుకు కనీసం 10 మందితో వివిధ విభాగాలతో డివిజన్ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్​ కుమార్, బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్, వాటర్ ​బోర్డు ఎండీ దానకిశోర్, అధికారులు పాల్గొన్నారు.