రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్: మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ సీ టీం అని.. రాష్ట్రంలో ఉన్నది చోర్ టీం అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ(అక్టోబర్ 19) తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ చాలా తక్కువన్నారు. అలాంటి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని కేసీఆర్ ను తిడితే ప్రజలు నవ్వుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 10–12 మంది గెలిస్తే రేవంత్ బీజేపీలో చేరడం పక్కా అని చెప్పారు. టికెట్ల పేరుతో రేవంత్ డబ్బులు ఎక్కడెక్కడ వసూలు చేశారో.. ఆ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డిని అడగాలన్నారు. టికెట్ కోసం విల్లాలు కూడా రాయించుకున్నారని ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్ అని రాహుల్ గాంధీ ఎంక్వైరీచేసుకోవాలని అన్నారు. ‘‘80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందట..? ఎట్లా జరుగుతది..? రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్.! ఎవడో రాసిచ్చింది చదువుతడు అంతే..? రాహుల్, ప్రియాంక నోటికొచ్చినట్టు తిడుతున్నారు.. కుటుంబ పాలన అంట.. రాహుల్ గాంధీ ఎవరు..? వచ్చింది అన్నా చెల్లెలు కాదా..? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మీది కుటుంబ కాదా..? కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశం ఇస్తే నల్లగొండలో ఫ్లోరైడ్ నీళ్లు పోగొట్టలేక లక్షా యాభై వేల మందిని దివ్యాగులను చేశారు.

ఛత్తీస్ గఢ్​ లో 47 వేల మంది దివ్యాంగులుంటే నెలకు రూ. 200 పింఛన్ ఇస్తుండ్రు. గుజరాత్ లో 47 వేల మంది దివ్యాంగులుంటే అక్కడి ప్రభుత్వం వారిని కనీసం గుర్తించడం లేదు. వంద శాతం వైకల్యం ఉంటే రూ. వెయ్యి పింఛన్ ఇస్తుండ్రు. కర్నాటకలో రూ. 1100 పింఛన్ ఇస్తుండ్రు. సీఎం కేసీఆర్ ఇక్కడ దివ్యాంగులకు అందిస్తున్న  పింఛన్ కు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.