కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ఫలితాలు

కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ఫలితాలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తాము చేపట్టిన పారిశ్రామిక విధానాల వల్ల మంచి ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు. కేంద్ర పరిశ్రమల శాఖ నిర్దేశించిన ‘వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక’ అమలులో  తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.  రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రైతు బంధులో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ.57,956 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 

అంతకు ముందు చేసిన ఓ ట్వీట్ లో కేటీఆర్ బీజేపీపై వ్యంగాస్త్రాలు సంధించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ కు వస్తున్న బీజేపీ నాయకులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ సమావేశాల కోసం హైదరాబాద్ కు  రాబోతున్న వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం అంటూ సెటైర్ వేశారు.  హైదరాబాద్ బిర్యానీ తినడం, ఇరానీ చాయ్ తాగడం మరవొద్దని జుమ్లా జీవులందరికీ గుర్తు చేస్తున్నా అంటూ ట్వీట్ లో తెలిపారు. యాదగిరి గుట్ట, కాళేశ్వరం, టీ హబ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలను సందర్శించాలని,  దమ్ముంటే  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు.