యువత వ్యవసాయ రంగం వైపు వస్తారు.. అద్భుతాలు సృష్టిస్తారు

యువత వ్యవసాయ రంగం వైపు వస్తారు.. అద్భుతాలు సృష్టిస్తారు

హైదరాబాద్: లాభం ఆశించకుండా రైతులకు సేంద్రియ‌ ఎరువులు అందించాలని అన్నారు రాష్ట్ర‌ వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. న‌గ‌రంలోని బేగంపేట ప్లాజా హోటల్‌లో జ‌రిగిన‌ తెలంగాణ సిరి సిటీ కంపోస్టు ప్రారంభోత్స‌వానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మట్టిని నమ్ముకున్న వారు ఎవరు చెడిపోలేదని, రాష్ట్రంలో ఆరు వందల సెంటర్ల ద్వారా ఆగ్రోస్ సంస్థ రైతులకు ఎరువులను అందిస్తోందన్నారు. దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారని, గ‌త సంవత్సరం 8.4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడార‌న్నారు. ఈసారి ఆ వాడ‌కం పదిన్నర లక్షలు దాటిందని అన్నారు.

తాను వేసిన పంటలకు ఎంత ఎరువు అవసరం అనేది చాలా మంది రైతులకు ఇంకా తెలియదని చెప్పారు మంత్రి. రాబోయే రోజుల్లో సీజనల్ వారిగా పంటల సాగు, ఎరువుల వాడకంపై అవగాహన రైతులకు కల్పిస్తామ‌న్నారు. కూరగాయలు, పండ్లు, లాంటి వాటిలో కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటోందని, ర‌సాయనిక ఎరువులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో సేంద్రియ ఎరువులను ప్రోత్సహిస్తున్నామ‌ని అన్నారు.

వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వల్ల నాణ్యమైన  పంటలు పండించ‌వ‌చ్చ‌ని, అధిక‌ దిగుబడి సాధించవచ్చని అన్నారు. సేంద్రీయ ఎరువులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంద‌ని అన్నారు.రాబోయే రోజుల్లో రైతు వేదికల ద్వారా సంవత్సరానికి రెండు సార్లు భూసార పరీక్షలు చేయిస్తామ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో యువత వ్యవసాయ రంగం వైపు వస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు