వరి సాగు వద్దు..కంది, పత్తి, నూనెగింజల సాగుతో మేలు

వరి సాగు వద్దు..కంది, పత్తి, నూనెగింజల సాగుతో మేలు

రాష్ట్రంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోందన్నారు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి. వరి సాగు వద్దు..కంది, పత్తి, నూనెగింజల సాగు చేస్తే  లాభదాయకంగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై తన నివాసం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం వ్యవసాయ అనుకూల విధానాలు, 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా, సాగునీటి రాకతో ఏటా సాగువిస్తీర్ణం పెరుగుతోందన్నారు. వరి పంటను తగ్గించి నూనె గింజల సాగును చేపట్టాలన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా నూనెగింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.విత్తన కంపెనీలు నూనెగింజల విత్తనాలను విస్తృతంగా రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని, రాబోయే రెండు నెలలు వ్యవసాయ శాఖ సిబ్బంది సమయస్ఫూర్తితో పనిచేయాలన్నారు.

రానున్న వానాకాలంలో కంది 20 లక్షల ఎకరాలకు, పత్తి సాగు 75 లక్షల ఎకరాలకు రైతులు పెంచాలని..దీనికి అనుగుణంగా 57 పత్తి విత్తన కంపెనీల ద్వారా 170 లక్షల నాణ్యమైన పత్తి విత్తన ప్యాకెట్లు నిర్ణీత సమయానికి సిద్ధంగా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ  చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతేకాదు నకిలీ పత్తి విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 20 లక్షల ఎకరాల్లోకంది సాగుకు అనుగుణంగా రాష్ట్ర, జాతీయ విత్తనాభివృద్ది సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర ప్రైవేట్ కంపెనీల ద్వారా 80 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దేశంలో మొదటి సారిగా క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం 90 లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు 22 లక్షల క్వింటాళ్ల దృవీకరించిన విత్తనాలు.. రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మే 15 వరకు విత్తనాలన్నీ జిల్లాలలో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి సాగుపై జిల్లాల వారీగా సర్వే నిర్వహించి కార్యచరణ ప్రణాళిక అందజేయాలన్నారు. వీటన్నిటిపై అన్ని జిల్లాల కలెక్టర్లు కళాజాత బృందాలతో రైతులను చైతన్యపరచాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.