కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

హైదరాబాద్: రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మొద్దని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ రాశారు. అందులో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని కేటీఆర్ ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి “కహానీలు” చెపుతున్న మోడీ ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తన స్వార్ధానికి అమ్ముతోందని కేటీఆర్ మండిపడ్డారు.

హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన 7200 ఎకరాల భూములను కేటాయించిందని చెప్పారు. ఒకవేళ కేంద్రం ఆ సంస్థలను అమ్మాలని నిర్ణయించుకుంటే ఆ భూముల్లో కొత్త పరిశ్రమలు స్థాపించాలని, లేకుంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. స్కై వే లాంటి ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుకు భూములు అడిగితే మార్కెట్ ధర ప్రకారం డబ్బుల చెల్లించాలని కేంద్రం డిమాండ్ చేస్తోందని.... అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రనికి ఎక్కడిదని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని మంత్రి కేంద్రాన్ని కోరారు.