సింగరేణి స్థలాల్లో.. కార్మికులు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు..అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

సింగరేణి స్థలాల్లో.. కార్మికులు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు..అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
  • నేడు కోల్​బెల్ట్​ ఏరియా ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం మీటింగ్ 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించకున్న కార్మికులకు రాష్ట్ర సర్కార్​ గుడ్​న్యూస్​ చెప్పింది. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్​​సీఎంగా ఉన్నప్పుడు జారీ చేసిన జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలు జారీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సీఎం భ‌‌‌‌ట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శనివారం ఆ ప్రాంత ఎమ్మెల్యేల‌‌‌‌తో స‌‌‌‌మావేశం నిర్వహించి రెగ్యుల‌‌‌‌రైజేష‌‌‌‌న్ ప్రక్రియ‌‌‌‌ ప్రారంభిస్తామ‌‌‌‌ని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోని 22 వేల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.

హక్కులు లేక.. లోన్లు రాక..

కోల్​బెల్ట్​వ్యాప్తంగా సింగరేణి భూముల్లో కార్మికులు ఇండ్లు కట్టుకున్నప్పటికీ ఎలాంటి హక్కులు లేవు. ఇండ్లపై లోన్లు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ స్పందించి గోదావరిఖనిలో సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న 17 వేల మందికి ఇండ్ల పట్టాలు అందజేశారు. కొత్తగూడెంలో 4 వేల పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత తీసుకువచ్చిన 76 జీవో ద్వారా కొత్తగూడెం ప్రాంతంలో 12 వేల ఇండ్లకు, రామకృష్ణాపూర్ లో 4 వేల ఇండ్లకు, బెల్లంపల్లిలో 5 వేల ఇండ్లకు, శ్రీరాంపూర్ లో 2,500 ఇండ్లకు అప్పటి ప్రభుత్వాలు పట్టాలు అందజేశాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియ 
నిలిచిపోయింది.

ఈ సారి 22 వేల ఇండ్లకు పైగా.. 

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1,500, శ్రీరాంపూర్ ఏరియాలో 1,400, బెల్లంపల్లిలో 4 వేల ఇండ్లు, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో 6 వేల ఇండ్లు, కొత్తగూడెం రీజియన్ లో 7,700 ఇండ్లు, భూపాలపల్లి జిల్లాలో 2 వేలతో కలిపి 22వేలకు పైగా ఇండ్లకు ఈసారి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు సింగరేణి క్వార్టర్స్ ను ఆనుకొని నిర్మించుకున్న ఇండ్లకు కూడా ఈసారి పట్టాలు ఇచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.