భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..అర్బన్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..అర్బన్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • త్వరలో సీఎం వద్దకు డిజైన్లు తీసుకెళ్తామని వెల్లడి
  • పైలెట్ ప్రాజెక్టు కింద 12 వేల ఇండ్లు నిర్మించాలని జీవో జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు అర్బన్​ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. పట్టణాల్లో జీవించే పేదవారికి తమ జీవ‌‌నోపాధికి ఇబ్బంది లేకుండా ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇండ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియెట్ లో అర్బన్​ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు, ప్రైవేట్ ఆర్కిటెక్ లు అందించిన అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల నమూనాలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 40 నుంచి 50 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ​ఇండ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు.

కేవలం ఇండ్లు కట్టడమే కాదు.. భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఉండే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలీని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే 10 అంతస్తుల వరకు టవర్స్ నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హాల్, బెడ్‌‌రూమ్, కిచెన్, బాత్‌‌రూమ్, వాస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇల్లు డిజైన్ ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌‌గా తీసుకొని, ఇండ్లు నిర్మించాలని తెలిపారు. అర్మన్​ఇండిరమ్మ ఇండ్ల డిజైన్లపై సీఎంతో చర్చించి ఫైనల్ చేస్తామని, అనంతరం పనులు స్టార్ట్ చేస్తామని వివరించారు.

పైలెట్ ప్రాజెక్టు కింద 12 వేల ఇండ్ల నిర్మాణం..

క్యూర్ పరిధిలో ఎల్ఐజీ (లోయర్ ఇన్ కమ్ గ్రూప్), ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ ) మోడల్ లో లక్ష ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ శుక్రవారం జీవో జారీ చేశారు. ఇందులో భాగంగా తొలి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద 12 వేల ఇండ్లు నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు భూముల్లో ఇండ్లు నిర్మిస్తామని, ల్యాండ్ ధరను ప్రభుత్వ వాటాగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. ఒక్క ఎల్ఐజీ ప్లాట్ కు రూ.5 లక్షలు సబ్సిడీగా ఇస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలో హౌసింగ్ బోర్డు స్థలాల గుర్తింపు, సర్వేపై ఉత్తర్వులు ఇవ్వాలని హౌసింగ్ బోర్డు ఎండీని సెక్రటరీ ఆదేశించారు.