హైదరాబాద్: పేదల భూములను కొల్లగొట్టేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ స్కెచ్‌లో భాగంగానే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి భూములను కొట్టేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య ధరణిని తీసుకొచ్చారని విమర్శించారు.అసెంబ్లీలో 22ఏ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి వల్ల పింక్ కలర్ చొక్కాలు వేసుకున్న వారికే ప్రయోజనం కలిగిందని మంత్రి ఆరోపించారు. ధరణిలో జరిగిన అక్రమాల కారణంగా ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
రెవెన్యూ శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం చిన్నది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 22ఏ పేరుతో పదేళ్ల పాటు పేదల భూములను చెరబట్టారని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత పదేళ్లలో దొర, వారి బంధువుల ఆస్తులు పెంచుకునేందుకే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. రెవెన్యూ శాఖ పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసైగల్లోనే నడిచిందని వ్యాఖ్యానించారు.
లాక్ సిస్టమ్‌తో అక్రమాలు దాచారు
ధరణిలో జరిగిన అక్రమాస్తులు బయటకు కనిపించకుండా లాక్ సిస్టమ్ తీసుకొచ్చారని పొంగులేటి ఆరోపించారు. భూముల ట్రాన్సాక్షన్లు బయటకు కనిపించకుండా ఈ విధానం పెట్టారని విమర్శించారు. ధరణి చట్టం తీసుకొచ్చిన సమయంలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని తెలిపారు.తమ ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయలేదని మంత్రి స్పష్టం చేశారు.
వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థల రద్దుతో గ్రామాల్లో ఇబ్బందులు
వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసి గ్రామాల్లో పాలనను అస్తవ్యస్తం చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ధరణిలో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించే పరిస్థితి కూడా లేకుండా చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేదల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.లంగాణలో పేదల భూములు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.రెవెన్యూ శాఖకు మంత్రి ఉన్నప్పటికీ గతంలో అన్ని వ్యవహారాలను కేసీఆరే చూసేవారని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు.
