- ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడం
- రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే చేయిస్తమని వెల్లడి
- ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నా.. ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి.. తదుపరి అవసరమైన వ్యయాన్ని రూ.5 లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తామని వెల్లడించారు. ఆ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేస్తామన్నారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని.. వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. రూ. 400 కోట్లతో డబుల్బెడ్రూం కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని సూచించారు. నగరానికి దూరంగా కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్ట పడటం లేదని, అలాంటి వారిని గుర్తించి, వారి స్థానంలో, ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించే ఆలోచన చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూఆక్రమణల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు సాంకేతిక పరిజ్ఞానంతో జాయింట్ సర్వే చేసి, సరిహద్దులను గుర్తించాలన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా ప్రతిష్టాత్మకమైనది, ఈ పథకం చాలా అద్భుతంగా అమలవుతోందని తెలిపారు. దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు.

