- అక్రెడిటేషన్ల తరువాత హెల్త్ కార్డులు, ఇతర వసతులు: పొంగులేటి
- సంస్థలు మారినా, అక్రెడిటేషన్ల మంజూరు కొనసాగుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో త్వరలోనే భేటీ అయ్యి, ఇండ్ల స్థలాలు, ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ఆఫీసులో కొత్త అక్రెడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడం వల్లే అక్రెడిటేషన్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగిందని, ఏప్రిల్ 30తో ముగియనున్న బస్సు పాసుల గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల సంఖ్యను పెంచడమే కాకుండా, వృత్తిపరమైన ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ల విషయంలో వివక్ష చూపిందని, 32,500 మందికి అవకాశం ఉన్నా కేవలం 23,352 మందికే పరిమితం చేసిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 46 వేలకు పెంచి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఇప్పటికే 2,800 దరఖాస్తులను ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు. జర్నలిస్టుల సూచనల మేరకు జీవోలలో అవసరమైన మార్పులు చేశామన్నారు. మే10వ తేదీని దరఖాస్తులకు కటాఫ్ డేట్‌గా నిర్ణయించామని, ఆ లోపు వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేస్తామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, వృత్తిపరమైన అర్హతలే ప్రాతిపదికగా ఈ కార్డులను జారీ చేస్తున్నామన్నారు.
మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జర్నలిస్టులు వివిధ సంస్థల మధ్య ఉద్యోగాలు మారినప్పటికీ కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, దీనిపై
ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అక్రెడిటేషన్ల సంఖ్య ఖరారైన వెంటనే, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, ఇతర వసతులపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టుల నైపుణ్యాల పెంపునకు కూడా చర్యలు చేపడతామని చెప్పారు.

