మేము పరిపాలకులం కాదు.. సేవకులం: మంత్రి పొంగులేటి

మేము పరిపాలకులం కాదు.. సేవకులం: మంత్రి పొంగులేటి

మేము పరిపాలకులం కాదు.. సేవకులం అని కామెంట్స్ చేశారు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హుజూర్ నగర్ మోడల్ కాలనీలో 2 వేల160 ఇండ్లును పూర్తి చేసి.. 3 నెలల్లో అర్హులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకా సుమారు 700 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమై.. శిలాఫలకం వేసి వదిలిపెట్టిందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రామస్వామి గట్టు వద్ద ఇందిరమ్మ మోడల్ కాలనీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా అధికారులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. 

గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖపై అధ్యయనం చేయడానికి మొదటిసారి హుజుర్ నగర్ లో పర్యటించానని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో రూ.30 కోట్లు ఖర్చు చేస్తే హుజుర్ నగర్ లో నిర్మించిన ఇండ్లు పూర్తయ్యేవని.. కనీసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పని చేయలేదన్నారు. ప్రతి గ్రామానికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.  

కాళేశ్వరం, సీతారామ మేడిగడ్డ ప్రాజెక్టులపై విచారణ చేయిస్తామని, బాధ్యులు ఎంతటి వారినైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల 71 వేల 757 కోట్ల రూపాయల అప్పులు చేసిందని, ఆ డబ్బులను ఏం చేశారో కూడా చెప్పలేదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు పనిచేయలేని పరిస్థితి ఉండేదన్నారు. కబ్జా చేసిన భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. నిరు పేదలకు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ కేసులు ఉండవని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూ ఆరు గ్యారెంటీ పథకాలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 28వ తేదీ అందరికి తీపి కబురు అందిస్తామన్నారు.