యాదగిరిగుట్టలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

యాదగిరిగుట్టలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
  • బ్రహ్మోత్సవాల కారణంగా 11 రోజుల పాటు నిలిపివేత
  • రేపు చంద్రగ్రహణం.. ఆలయం మూసివేత

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు 11 రోజుల పాటు నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ, హోమం, బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేశారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ సేవలను తిరిగి ప్రారంభించారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

చంద్రగ్రహణం కారణంగా 3న గుడి బంద్‌‌

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3న యాదగిరిగుట్ట ఆలయం మూత పడనుంది. మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలభోగం, ఆరగింపు, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. అనంతరం 5.45 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. అనంతరం 7 గంటలకు ద్వారాలు మూసి వేసి, మళ్లీ 4న ఉదయం 3 గంటలకు గుడిని తెరవనున్నారు.

ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఈ నెల 3న సాయంత్రం నిర్వహించాల్సిన హోలికోత్సవాన్ని చంద్రగ్రహణం కారణంగా సోమవారం సాయంత్రమే చేపట్టనున్నట్లు ఈవో భవానీ శంకర్‌‌ తెలిపారు.