స్వేదపత్రం కాదు.. మీ సౌధపత్రం బయటపెట్టాలి

స్వేదపత్రం కాదు.. మీ సౌధపత్రం బయటపెట్టాలి

 

  • రాష్ట్రాన్ని ముంచి కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పెంచుకుంది
  • బంగ్లాలు, ఫామ్ హౌస్​లు ఎట్ల వచ్చినయో ప్రజలకు చెప్పాలి
  • కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైనా కాకముందే విమర్శలేందని నిలదీత

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే బీఆర్​ఎస్​ నాయకులు విమర్శలు మొదలుపెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. ‘‘బీఆర్​ఎస్​ వాళ్లు అప్పులతోపాటు ఆస్తులు పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణను అప్పుల్లో ముంచి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పెంచుకుంది” అని అన్నారు. విడుదల చేయాల్సింది స్వేద పత్రం కాదని, బీఆర్​ఎస్​ సౌధ పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘మీరు ఎన్నెన్ని బంగ్లాలు కట్టుకున్నరు? ఎన్నెన్ని ఫామ్ హౌస్​లు ఏర్పాటు చేసుకున్నరు? మీ ఇండ్లకు వందలకోట్ల విలువ ఎట్ల వచ్చింది? దీనిమీద ప్రజలకు సౌధపత్రం ఇవ్వాలి”  అని అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ అత్త కూడా కొత్త కోడలును ఇరవై రోజుల్లో ఏమీ అనదని, అన్నీ సర్దుకున్నాకే మంచీచెడు మాట్లాడుతుందని అన్నారు. అలాంటిది బీఆర్ఎస్ నాయకులు మాత్రం స్వేదపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారని మండిపడ్డారు. అప్పులు చేసి తెలంగాణకు ఆస్తులు పెంచినట్లు గొప్పలు చెప్తున్నారని, వాస్తవానికి తెలంగాణను అప్పుల్లో ముంచి కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పోగేసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖజానా పరిస్థితి చూస్తే దారుణంగా ఉందని ఆయన అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు పెంచి రాష్ట్రాన్ని ఆగంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు నెలనెలా టైమ్​కు జీతాలు కూడా ఇవ్వలేదని, పదేండ్లలో వందేండ్ల విధ్వంసం చేశారని అన్నారు. బీఆర్​ఎస్​ వాళ్ల ఆస్తులను మాత్రం వందేండ్లు తరగ కుండా పెంచుకున్నారని దుయ్యబట్టారు. 

ఉద్యోగులకు ఐదో తారీఖులోపు జీతాలు ఇస్తం

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి నుంచి ఐదో తారీఖు లోపు జీతాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు. పింఛన్లు కూడా అదేవిధంగా చెల్లిస్తామని అన్నారు. ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చిందని, ఇప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, ప్రజలు ఆరు గ్యారంటీలతోపాటు ఇతర సమస్యలపై కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వమే ప్రజలకు దరఖాస్తు ఫారాన్ని అందిస్తుందని అన్నారు. ఉద్యోగులు కూడా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకోవాలని ఆయన తెలిపారు.