తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని పక్కన పెట్టి విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు సంధించారు. మేం కడుతున్న పన్నులెంత? మీరు తెలంగాణకు ఇస్తున్న నిధులెంత? అంటూ పొన్నం సూటిగా ప్రశ్నించారు.
పదేళ్లుగా తెలంగాణకు ఏం ఇచ్చారో చర్చించేందుకు బీజేపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని మండిపడ్డారు. కేవలం బంగారం కొనొద్దని చెప్పడానికే ప్రధాని ఇక్కడికి వచ్చారా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని గతంలో మోదీ చెప్పిన మాటలు ఏమయ్యాయి? అని పొన్నం ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అసెంబ్లీలో చర్చించి, సీబీఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నిన్నటి ప్రధాని ప్రసంగంలో కేసీఆర్ పేరు గానీ, కాళేశ్వరం ప్రస్తావన గానీ ఎందుకు లేదని అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు.వాజ్ పేయి హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. రాముడిని మీరు ఎంత పూజిస్తారో.. మేమూ అంతే పూజిస్తాం. కానీ మేం రాముడి పేరుతో ఓట్లు అడగం అంటూ బీజేపీ తీరును తప్పుపట్టారు.తెలంగాణకు రావాల్సిన నిధులపై బరాబర్ అడుగుతామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
