
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి తెలంగాణ ప్రభుత్వం చేరింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన సారథి పోర్టల్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ వాహన్ సారథి పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేయడంతో పాటు ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఇందులో పర్మిట్‌లు, పన్నులు, డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్‌లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ పోర్టల్ తో అనుసంధానమైనా..గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా మన రాష్ట్రం దూరంగా ఉండిపోయింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రభుత్వం ఈ జాతీయ పోర్టల్ లో చేరాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ సమాచార కేంద్రం ( నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఇటు వాహనాలకు, అటు డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని రకాల వివరాలన్నింటిని ఈ పోర్టల్ నమోదు చేసుకుంటుంది. దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పు వంటివి చేసుకునే అవకాశం ఉంటుంది.
►ALSO READ | 94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం
ఈ డిజిటల్ సేవల ద్వారా ప్రజలు తమ వాహనానికి సంబంధించిన, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘వాహన్’ సేవలను రాష్ట్రంలో ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘సారథి’ అప్లికేషన్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్థరణ, చిరునామా మార్పు, కొత్త వాహన కేటగిరి చేర్పు తదితర సేవలను దేశంలో ఎక్కడినుంచైనా పొందొచ్చు. సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్స్‌లు కేంద్రం ఆధ్వర్యంలో నడిచే డీజీ లాకర్ ప్లాట్‌ఫాం ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. డీజీ లాకర్ ద్వారా అధికారిక డాక్యుమెంట్లను, డ్రైవింగ్ లైసెన్స్‌లను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరచి అవసరమైనప్పుడు పొందొచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు.. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అసలైనదేనని ఆయా దేశాధికారులు ధ్రువీకరించుకోవడం ‘సారథి’ ద్వారా సులభం అవుతుంది.