కొడిమ్యాల, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కొండగట్టు అంజన్నకు ముడుపు కట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేసుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా ఉండాలని కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభించినట్లు తెలిపారు.
అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమయ్యాయని, దీనిని సాకుగా చూపి బీఆర్‌ఎస్ లీడర్లు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గిరిప్రదక్షిణను ప్రారంభించిన రోజే భారీగా వర్షం కురవడం శుభసూచకమన్నారు. జోరు వానలోనే మంత్రులు ఎమ్మెల్యేలు గిరిప్రదక్షిణను పూర్తి చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.
