
- 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు పోతున్నం
- రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జయంతికి హాజరు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. బీసీలకు చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని చెప్పారు. రిజర్వేషన్లు అమలుచేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నామని అన్నారు.
‘బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడొద్దు. చేతులెత్తి మొక్కుతున్న’’అని పొన్నం అన్నారు. రవీంద్ర భారతిలో వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మపై ఇనగుర్తి మధు రాసి పాడిన పాట, పుస్తకాన్ని మంత్రి పొన్నం ఆవిష్కరించి మాట్లాడారు.
అసెంబ్లీలో చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వపరమైన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయట్లేదన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు కొందరు అడ్డుపడితే ఎలా కొట్లాడి సాధించుకున్నామో.. అలాగే, బీసీ రిజర్వేషన్ల విషయంలో మనమంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలది. రెండు చేతులు జోడించి మొక్కుతున్న.. మా నోటికాడి ముద్దను కోర్టుకు వెళ్లేవారు లాక్కోవద్దు. మేము ఎవరి రిజర్వేషన్లు గుంజుకోవడం లేదు. సామాజికంగా, చట్టపరంగా పక్కన ఉన్న తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లను ఇక్కడ కూడా అర్హత ప్రకారం ఇవ్వాలని కోరుతున్నం.
రిజర్వేషన్లకు ఎవరైనా అడ్డం వస్తే సామ, దాన, భేద దండోపాయాలను అమలు చేయడానికి వెనుకాడబోం’’అని పొన్నం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా వెళ్తే వీపు చింతపండు అయిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తదితరులు పాల్గొన్నారు.