రాష్ట్రంలో బీసీ కుల గణన బాధ్యత తీస్కుంట: మంత్రి పొన్నం

రాష్ట్రంలో బీసీ కుల గణన బాధ్యత తీస్కుంట: మంత్రి పొన్నం


బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కుల గణన చేపడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారని.. ఆ హామీని అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ​అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల గణన జరిగితేనే బీసీల లెక్కలు తేలుతాయని, అప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. రెండు ప్రధాన పార్టీల నుంచి 8 మంది గౌడ కులస్తులు పోటీ చేస్తే, అందులో నలుగురు గెలిచారని.. కాంగ్రెస్ పార్టీ నుంచి తానొక్కడినే విజయం సాధించానని పొన్నం చెప్పారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.