
దేశంలోనే కార్మిక నాయకుడిగా కాకా నిలిచిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంధ్ర భారతిలో జరిగిన కాకా జయంతి ఉత్సవాల్లో పొన్నం మాట్లాడారు. రాజకీయ చరిత్రలో కొందరి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని.. అందులో కాకా పేరు అగ్రస్థానంలో ఉంటుందన్నారు. కార్యకర్తగా మొదలై కేంద్రమంత్రిగా ఎదిగారని కొనియాడారు పొన్నం.
కార్మిక రంగంలో కాకా తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరు తేలేదన్నారు పొన్నం. బడుగు బలహీన వర్గాల గొంతుకగా కాకా నిలిచారని చెప్పారు. కాకా,ఎంఎస్సార్, చొక్కారావుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాకా వెంకటస్వామికి డైరెక్టుగా ప్రజలతో కనెక్షన్ ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలు అర్పించిన వ్యక్తి కాకా అని కొనియాడారు. కాకా వారసులు రాజకీయాల్లో రాణించారని.. కార్మికులకు కాకా కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి కాకా అని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో కాకాది ప్రత్యేక స్థానం అని మంత్రి పొన్నం ప్రశంసించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పోరాటం చేసి.. స్వరాష్టంలోనే ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తి కాకా అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన అనుసరించిన మార్గం.. రాష్ట్ర ఏర్పాటుకు దారి చూపిందన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కాకా వంటి నేతల స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు పొన్నం.