కేసీఆర్​ గతాన్ని మర్చిపోయిండు: పొన్నం

కేసీఆర్​ గతాన్ని మర్చిపోయిండు: పొన్నం
  •     6 గ్యారంటీలతో ఓటమి భయం: పొన్నం

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయి 100 రోజులు కాలేదు.. ప్రజలు ఇచ్చిన షాక్​తో అప్పుడే గతాన్ని మర్చిపోయారా? అని కేసీఆర్​కు మంత్రి పొన్నం ప్రభా కర్​ చురకలంటించారు. మీ పాలనలో ఆడ బిడ్డలు కుండలతో వచ్చి దాహమో రామచంద్రా అన్నారని.. ఈ విషయం మర్చిపోతే ఎలా? అని  మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మండిపడ్డారు. ‘మీ పాలన సక్కగా ఉంటే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరికి కర్రుకాల్చివాత పెట్టారు. మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక మీకు ఓటమి భయం పట్టుకున్నది. మీ పాలనలో నాగార్జున సాగర్ కింద వ్యవసాయానికి క్రాప్ హాలీ డే ప్రకటించిన సంగతి మర్చిపోయావా’ అని ప్రశ్నించారు.  మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు.  

దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొన్నదని,  90 రోజుల్లోనే తాము ఏదో చేసినట్టు ఎందుకు విషం కక్కుతున్నారని కేసీఆర్​పై పొన్నం మండిపడ్డారు. గతంలో 9 మంది ఎంపీలు ఉంటే చేనేత మీద జీఎస్టీ ఎందుకు తగ్గించటానికి కృషి చేయలేదని  ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ‘కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఓ  పన్ను వదలైతే పన్ను సరిచేసుకుంటాం కానీ పన్ను ఊడగొట్టుకోం అని అంటున్నారని, కానీ మీ అతి తెలివి వల్ల డిజైన్ మార్చారని.. నోట్లో ఉండాల్సిన పన్నును తీసుకుపోయి తలకాయ మీద పెట్టకుంటామా? అని ఎద్దేవా చేశారు.  మీ అతి తెలివి వల్ల లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ వృథా చేశారని కేసీఆర్​పై పొన్నం ఫైర్ అయ్యారు.