పత్తి మద్దతు ధరలో తేడా రావొద్దు: నిరంజన్ రెడ్డి

పత్తి మద్దతు ధరలో తేడా రావొద్దు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో పత్తి సాగు బాగా పెరిగిందని, పత్తి కొనుగోలు కోసం 302 జిన్నింగ్‌ మిల్లులను గుర్తించామని  వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. క్వింటాల్​ పత్తి మొదటి రకాన్ని రూ. 5,550, రెండో రకాన్ని రూ. 5,255 మద్దతు ధరతో కొనాలని అధికారులను ఆయన ఆదేశించారు. మద్దతు ధరలో  ఏమాత్రం తేడా రావద్దన్నారు. పత్తిపంట కొనుగోళ్లపై సోమవారం నగరంలో ఓ హోటల్‌లో మంత్రి సమీక్షించారు. పెద్ద ఎత్తున పత్తి పంట మార్కెట్లకు వచ్చే అవకాశం ఉందని, – కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు  జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసుకుని పత్తి కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తూకంలో తేడాలు రావొద్దని, వే బ్రిడ్జ్ లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతించిన చార్జీలకు మించి రైతుల నుంచి ఒక్క పైసా కూడా ఎక్కువగా వసూలు చేయొద్దన్నారు. పత్తిని కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో ఆన్ లైన్ ద్వారా డబ్బులు జమచేయాలని ఆదేశించారు. వివరాల లోపం పేరుతో డబ్బులు జమచేయడంలో జాప్యం జరగొద్దన్నారు. సమీక్షా సమావేశంలో కాటన్​ కార్పొరేషన్‌ ఆఫ్​ ఇండియా ఎండీ అలీరాణి,  వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.