సోషల్ మీడియాలో కాంగ్రెస్‎ను బద్నాం చేస్తున్నరు: బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క ఫైర్

సోషల్ మీడియాలో కాంగ్రెస్‎ను బద్నాం చేస్తున్నరు: బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క ఫైర్

కామారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ పనిగట్టుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ రెండు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరగనున్న బీసీ బహిరంగ సభ ఏర్పాట్లపై కార్యకర్తలతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 

బీసీ బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే  కామారెడ్డి సభలో శంఖరావం పూర్తిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 

యూరియా కొరతపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యూరియా పంపిణీ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటికీ కావాలనే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై కూర్చొబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్భాషలాడుతున్నారన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీ ఒక్కటేనని ... కావాలనే బీజేపీ రాష్ట్రానికి యూరియా సకాలంలో పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. రైతులను గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రైతులకు ఉచిత కరెంటు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దేశమంతా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద బతుకుందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కూతురు కవితనే బయటపెట్టిందన్నారు.