- పిల్లల దత్తతపై అపోహలు తొలగించేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: దత్తత అనేది దానం కాదని..ఒక చిన్నారి జీవితానికి కొత్త ఆరంభమని మంత్రి సీతక్క అన్నారు. సమాజంలో కుటుంబం, ప్రేమకు దూరమైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అడాప్షన్ హెల్పింగ్ డెస్క్, ఫోస్టర్ కేర్ సెంటర్ తో పాటు బస్ స్టేషన్‌లో బాలింతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దత్తతపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, చట్టబద్ధమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికే హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనధికారిక దత్తతల పేరుతో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పిల్లలకు శాశ్వత కుటుంబం దొరికే వరకు వారికి ప్రేమపూర్వక వాతావరణం కల్పించేందుకు 'ఫోస్టర్ కేర్' విధానం ఎంతో దోహదపడుతుందని వివరించారు.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తల్లులు తమ పసిబిడ్డలకు పాలివ్వడానికి పడుతున్న ఇబ్బందులను గమనించి, వారి ప్రైవసీ, భద్రత కోసం ప్రత్యేక కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం గర్వకారణమని, ఇవన్నీ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో భాగమని ఆమె తెలిపారు. రోష్ని సెంటర్ భాగస్వామ్యంతో పిల్లలకు కౌన్సిలింగ్, థెరపీ సేవలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.
