- టెండర్లు పూర్తికాకముందే అవినీతి ఆరోపణలేంది?: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ద్వారా చేపడుతున్న రహదారుల పనులపై మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న విమర్శలు వాస్తవ దూరమని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాకముందే అవినీతి జరిగిందని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
గ్రామీణ రహదారులను జాతీయ రహదారుల స్థాయిలో ఆధునీకరించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీతక్క అన్నారు. హరీశ్ రావు ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడాలని ఆమె సూచించారు. కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ 'హ్యామ్' విధానాన్ని 2016 నుంచి ఎన్ హెచ్ఏఐ విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల కోట్ల వ్యయంతో 374 ప్రాజెక్టులు ఈ మోడల్‌లోనే సాగుతున్నాయని వివరించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి పెంచడమే లక్ష్యంగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. హ్యామ్ తొలి దశలో రూ. 6,250 కోట్ల వ్యయంతో.. 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేసేందుకు 17 ప్యాకేజీలను ప్రభుత్వం సిద్ధం చేసిందని సీతక్క వెల్లడించారు.
