
- మైదం మహేశ్ జీతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు
- ప్రాసెస్ లో నిర్లక్ష్యం చేసిన ఇద్దరిని విధుల్లోంచి తీసేశాం
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్: ములుగు మల్టిపర్పస్ వర్కర్ మైదం మహేశ్ జీతం ఆలస్యానికి ప్రభుత్వానికి సంబంధం లేదని, జీతాన్ని ప్రాసెస్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరిని విధుల్లోంచి తొలగించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. మైదం మహేశ్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ హయాంలో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదని అన్నారు.
సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా కలెక్టరేట్ల ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసనలు చేస్తే పట్టించుకోని కేటీఆర్ ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. వేలాది పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఇందుకోసం గ్రీన్ ఛానెల్ విధానాన్ని ప్రవేశపెట్టి, జీతాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. మైదం మహేశ్ జీతం ప్రాసెస్ చేయడానికి కారకులైన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామని, బిల్ కలెక్టర్ ను విధుల్లోంచి తొలగించామని, అదే విధంగా మహేశ్ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించామని చెప్పారు. ములుగు నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైయ్యిందని, ఈ క్రమంలో పంచాయతీ పద్దు నుంచి మున్సిపాలిటీ శాఖలోకి కార్మికులను మార్చి జీతాల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.