V6 News

దేశాన్ని విభజించడమే బీజేపీ అజెండా..కాంగ్రెస్‌తోనే ఐక్యత: మంత్రి సీతక్క

దేశాన్ని విభజించడమే బీజేపీ అజెండా..కాంగ్రెస్‌తోనే ఐక్యత: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి ఐక్యతను దెబ్బతీయడమే బీజేపీ ఏకైక అజెండా అని మంత్రి సీతక్క విమర్శించారు. కులమతాల పేరుతో సమాజాన్ని విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం ఆమె నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన పీసీసీ సేవాదళ్ మూడో రోజు శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ సేవాదళ్ క్రమశిక్షణకు మారుపేరని, గాంధీజీ ఆలోచనల నుంచి పుట్టిన ఈ సంస్థ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషిం చిందని గుర్తుచేశారు.

సేవాదళ్ కార్యకర్తలు దేశ భక్తులని, వారు దేశ రక్షణ దళాలుగా పనిచేయాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించిన ఆమె.. గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. పార్టీ చేసిన త్యాగాలను, కాంగ్రెస్ చరిత్రను గ్రామ స్థాయిలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలోనూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశ ఆత్మను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉందని సీతక్క పేర్కొన్నారు. ..