మంథనిలో స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథనిలో స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

 

    యువతకు నైపుణ్య శిక్షణ     కోసమేనని వెల్లడి
    మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే యువత ఏఐ నేర్చుకోవాలి: 
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి/మంథని, వెలుగు: యువత  నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంథనిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌ను ప్రారంభించారు. యువతకు టాస్క్ ఆధ్వర్యంలో   డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎస్ఆర్​లో భాగంగా సీటీఆర్​ఎల్​ఎస్​ డేటా సెంటర్  సహకారంతో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంగాపురిలో రూ.7.3 కోట్ల వ్యయంతో ప్లగ్ అండ్ ప్లే గార్మెంట్స్ యూనిట్‌‌కు  శంకుస్థాపన చేశామని,  ఇది పూర్తయితే  ఒకేసారి 400 మంది మహిళలకు శిక్షణ అందించవచ్చని  పేర్కొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు,  అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ అందజేశారు. ఆ తర్వాత పెద్దపల్లిలో  ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. అగ్నివీర్, టాస్క్, డీట్​లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు. 

నైపుణ్యాలు నేర్చుకోవాలి: ఎంపీ వంశీకృష్ణ

ప్రస్తుత ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే యువత తప్పనిసరిగా ఏఐ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సూచించారు. గత బీఆర్​ఎస్ సర్కార్ ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా మంథని, పెద్దపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంథని స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌ను యువత వినియోగించుకోవాలని సూచించారు. జాబ్​మేళాలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి, ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ మక్కాన్​సింగ్, మున్సిపల్ చైర్మన్  శ్రీనివాస్, మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టాస్క్ చైర్మన్ నితిన్ కుమార్ రెడ్డి, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రీవేది, ఏఎంసీ చైర్మన్ కే వెంకన్న తదితరులు    పాల్గొన్నారు.