- రెడీ టు వర్క్ ఫోర్స్, ఇన్నొవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి
- హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. స్ట్రాటజిక్ ఇన్నొవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు (జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను రెడీ చేస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ పేరిట 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైనెకెన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని అన్నారు.
తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం
హైదరాబాద్‌ను కేవలం ఐటీ డెస్టినేషన్‌గా కాకుండా, ప్రపంచ శ్రేణి వ్యాపార పరిష్కారాలకు చిరునామాగా మారుస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు మొదలు... మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆ జాబితాలో 150 ఏండ్ల చరిత్ర కలిగిన హైనెకెన్ చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు.
తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ... ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్ గా పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం 300 మందికిపైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందని తెలిపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్, సీఎఫ్ వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రూక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ పాల్గొన్నారు.

