జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తం : మంత్రి శ్రీధర్ బాబు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తం : మంత్రి శ్రీధర్ బాబు
  • హైబిజ్ టీవీ మీడియా అవార్డుల వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు
  • ‘వీ6 వెలుగు’కు బెస్ట్ అడ్వర్టయిజింగ్ టీమ్​ అవార్డ్ 
  • ‘వెలుగు’ జర్నలిస్ట్ ఆంజనేయులు గౌడ్ కు ‘స్పెషల్ కమెండేషన్ అవార్డ్’ అందజేత   

హైదరాబాద్, వెలుగు: వృత్తిలో నిబద్ధత చూపే జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం మంచి పరిణామమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డుల కార్యక్రమానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న హైబిజ్ టీవీ యాజమాన్యాన్ని అభినందించారు.

చాలా మంది జర్నలిస్టులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వడంతోపాటు వారి భద్రతకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా వెలుగు దిన పత్రిక సీనియర్ జర్నలిస్టు బుర్ర ఆంజనేయులు గౌడ్ కు హైబిజ్ టీవీ ప్రకటించిన “చీఫ్ గెస్టు స్పెషల్ కమెండేషన్” అవార్డును మంత్రి శ్రీధర్ బాబు అందించారు.

మూడు దశాబ్దాలకుపైగా జర్నలిస్టుగా కొనసాగుతున్న ఆంజనేయులుకు తన చేతుల మీదుగా అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అలాగే బెస్ట్ అడ్వర్టయిజింగ్ టీం కేటగిరీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల తరఫున వీ6 వెలుగుకు అవార్డు దక్కింది. అడ్వర్టయిజింగ్ సీజీఎం సంతోష్ అండ్​ టీమ్​ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. వీ6 టీవీ తరఫున యాంకర్ అపర్ణకు మంత్రి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, వివిధ రంగాల ప్రముఖులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.