
- ఉర్జా మంథన్ -2025 లో మంత్రి శ్రీధర్ బాబు
- రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ వివరణ
న్యూఢిల్లీ, వెలుగు: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం ఢిల్లీలోని న్యూభారత మండపంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియా ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చించారు.
సదస్సులో రాష్ట్రం నుంచి మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని, రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఫ్యూయల్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి, టైర్2 సిటీలకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని మంత్రి ప్రత్యేకంగా వివరించారు.
కేంద్ర ప్రభుత్వం వీటిలో పెట్టుబడి పెట్టాలని కోరారు. సాటాట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాల కింద.. క్లీన్ ఫ్యూయల్ టెక్నాలజీని పెంపొందించడానికి ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తూర్పు-పశ్చిమ గ్యాస్ పైప్‌లైన్ వెంబడి తెలంగాణ వ్యూహాత్మక స్థానాన్ని వివరించారు. తక్కువ ఖర్చుతో గ్యాస్ ఆధారిత ఇంధన పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కేంద్రం నేతృత్వంలోని మరిన్ని పెట్టుబడులను ప్రతిపాదించారు.