తెలంగాణ వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌కు గుర్తింపు : మంత్రి తలసాని

తెలంగాణ వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌కు గుర్తింపు : మంత్రి తలసాని

పద్మారావునగర్​, వెలుగు :  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే  హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిందని సనత్ నగర్ బీఆర్‌‌ఎస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్‌లోని జయలక్ష్మి టవర్స్ లో అపార్ట్ మెంట్  వాసులతో నిర్వహించిన ముఖాముఖి ( ఫేస్​ టూ ఫేస్​ ) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  2014  తర్వాత సీఎం కేసీఆర్​ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు.  ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నూతన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్,బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ఆయా అపార్ట్ మెంట్​ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రాంతం, భాష వేరైనా నగరంలో నివసిస్తున్న వారు మా బిడ్డలే.. 

సికింద్రాబాద్ ​: ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే పార్టీల నాయకులను నమ్మి మోసపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.  ఆదివారం రాంగోపాల్ పేట డివిజన్‌లోని జీరాలో గల గుజరాతి స్కూల్‌ లో  జైన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా సమ్మేళన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలో నిర్వహించిన జల్సా ఏ హమ్ కార్యక్రమంలో మంత్రి  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ప్రాంతం, భాష ఏదైనా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని మా బిడ్డలుగానే భావిస్తామని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

 గుజరాతి సమాజ్‌కు స్థలం కేటాయించే విధంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.  గోశాలలోని గోవులకు ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ క్లినిక్ ల ద్వారా ఉచిత వైద్య సేవలు, మందులను అందిస్తుందని తెలిపారు. సమావేశంలో నిర్వహకులు ప్రకాష్ వోరా, మయంగ్, జస్మత్ పటేల్, ఉత్తమ్ కుమార్ సింగ్ రాజ్ పురోహిత్, జనక్, జష్, చైన్ సింగ్, గులాబ్ సింగ్, మెహతా   పాల్గొన్నారు.