
జైకా సంస్థ నిధులతో డెయిరీల అభివృద్ధి
ప్లాన్ రెడీ చేయాలని : మంత్రి తలసాని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ(జైకా)నిధులతో రాష్ట్రంలో డెయిరీ డెవలప్‌మెంట్ స్కీమ్ అమలు చేయటానికి ప్లాన్ రెడీ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జైకా నిధులతో పాడి పశువుల కొనుగోలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల(బీఎంసీఏయూ)ను ఏర్పాటు చేయాలని అధికారులకు తలసాని చెప్పారు. గ్రామాల్లో పాల నాణ్యతను పరీక్షించే పరికరాలు, మార్కెటింగ్ కు కావాల్సిన సౌలతులు, డెయిరీ పార్లర్ ల ఏర్పాటుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. నేషనల్ ప్రోగ్రాం ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భాగంగా.. మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు, పశువుల దాణా ఉత్పత్తిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు మేలుజాతి పాడి పశువులతో పాటు తక్కువ వడ్డీకి లోన్ ఇప్పించాలని మంత్రి స్పష్టం చేశారు.
రైతులకు వ్యవసాయంతో పాటు పాడి రంగంలో అవగాహన కల్పించి.. వారి నుంచి పాలను సేకరించే విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. పాడి రంగాన్ని ఆదాయ వనరుగా మలచుకొనే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ నెల మొదటి వారంలో రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాల్లో ఎంపిక చేసిన 31 మంది వ్యవసాయ పారిశ్రామికవేత్తలతో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుపై ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదార్ సిన్హా, ఇతర డైయిరీ అధికారులు మీటింగులో పాల్గొన్నారు.
ధరణి పోర్టల్‌తో రైతులు ఆగమాగం
ఈ నెల 5న వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, వెలుగు: రైతులను ఆగం చేస్తున్న ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని, ధరణి పోర్టల్‌తో నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు వ్యవసాయ భూములను కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. టీఆర్ఎస్ సర్కారు వాటిని గుంజుకుంటోందన్నారు. రైతు సమస్యల పరిష్కారం,రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు అంశాలపై కలెక్టరేట్‌ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
కంపు కొడుతున్న లాడ్జిలో విద్యార్థినులకు వసతి
వికారాబాద్, వెలుగు: ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు వికారాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన హార్టికల్చర్ విద్యార్థినులకు దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. అధికారులు ఓ కంపుకొడుతున్న లాడ్జిని వారికి కేటాయించడంతో ఆ విద్యార్థినులంతా లోపలికి వెళ్లకుండా రాత్రి వరకు బయటే ఉన్నారు. ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా మహబూబ్ నగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్వర్సిటీ నుంచి 26 మంది విద్యార్థినులు గురువారం వికారాబాద్ చేరుకున్నారు. అయితే, అధికారులు వారికి పాడైపోయి క్లీన్‌గా లేని ఓ లాడ్జిని కేటాయించారు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థినులపై అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడే ఉండాలని, లేదంటే కోర్సు క్యాన్సిల్ చేసుకుని వెళిపోండంటూ బెదిరించారు. డిబార్ చేస్తామని కూడా బెదిరించినట్లు ఆ స్టూడెంట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నేతలు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు అక్కడికి చేరుకుని హార్టికల్చర్ అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆ లాడ్జిలోని ఓ గదిని క్లీన్ చేయించిన అధికారులు తాత్కాలికంగా వారిని అక్కడ ఉంచుతామని, తొందరలోనే మరో ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఆటోలు చోరీ.. పాత నేరస్తుడి అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: ఆటోలు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్‌లోని చింతల్మేట్హుడాకాలనీలో ఉండే వెంకటేశ్ అలియాస్అప్పి(22) వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో మియాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌ల పరిధిలో ఆటోలను కొట్టేసి జైలుకెళ్లాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గురువారం రాయదుర్గం పోలీసులు గచ్చిబౌలి చౌరస్తాలో వెహికల్స్ చెక్ చేస్తుండగా వెంకటేశ్అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.5లక్షల విలువైన 8 ఆటోలు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.
జగద్గిరిగుట్టలో మైనర్..
జీడిమెట్ల: తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ ను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలో అనుమానాస్పదంగా తిరుగున్న ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల పీఎస్లపరిధిలోని ఆరు ఇండ్లల్లో అతడు చోరీలు చేసినట్లు తెలుసుకున్నారు. మైనర్ నుంచి నుంచి 67గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.2లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని జువైనల్జస్టిస్ బోర్డు ముందు హజరుపరిచి.. జువైనల్‌హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.