లష్కర్​ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేసినం : మంత్రి తలసాని

లష్కర్​ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేసినం :  మంత్రి తలసాని
  • మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ 

సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల 9న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్ చెప్పారు. ఆలయ ఈవో మనోహర్​రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు శుక్రవారం మంత్రి తలసాని దంపతులను వెస్ట్​మారేడ్​పల్లిలోని ఇంట్లో కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు లక్షల్లో తరలిరానున్నారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాలకమండలి సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్, ఆలయ చైర్మన్ రమేశ్, సభ్యులు కిషోర్, జగదీష్ ప్రసాద్, రాజు, కృష్ణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

వంద లైట్లు కూడా పెట్టట్లేదని మంత్రి ఫైర్

మెహిదీపట్నం: బోనాల ఉత్సవాలపై శుక్రవారం కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద అన్ని శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఆలయాల వద్ద డ్రైనేజీలు పొంగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గుడి వద్ద 400 లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ 100 లైట్లు కూడా కనిపించడం లేదని ఫైర్​అయ్యారు. రెండ్రోజుల్లో లైట్లు ఏర్పాటు చేయకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు. కాగా వాటర్​బోర్డు జీఎం మీటింగుకు రాకపోవడంపై మంత్రి తలసాని మండిపడ్డారు. ఆలయాలకు వెళ్లే రోడ్లకు అవసరమైతే రిపేర్లు చేయాలని జోనల్ కమిషనర్ రవికిరణ్​ను ఆదేశించారు. ఈ నెల 10 లేదా11న అన్ని ఆలయాలకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. సబ్జిమండి మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపుకు భారీ బందోబస్త్ ​ఏర్పాటు చేయాలన్నారు.