కవిత ఇంటిపై దాడి కరెక్టు కాదు

కవిత ఇంటిపై దాడి కరెక్టు కాదు

తమను రెచ్చగొట్టొద్దని.. వేలాది మంది సైన్యం ఉన్నారని బీజేపీ నేతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారని.. తామంతా ఇక్కడే ఉన్నామన్నారు. బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటన్నారు. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదని.. టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా అని బీజేపీ లీడర్స్ ను ప్రశ్నించారు.

అసలు  ముట్టడికి కారణం ఏంటో.. ఆ అంశం పై అవగాహన ఉందా ? అని తలసాని నిలదీశారు. ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలు.. ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన తమ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తామని అంటున్నారని.. కానీ వారిని వారించామన్నారు . కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు తాము వ్యవహరించిన తీరును తెలుసుకోవాలని సూచించారు. కవితపై ఆరోణలు చేసిన వాళ్లపై కూడా కేసులు  నమోదయ్యాయని ..క్రమశిక్షణ పార్టీ అంటే ఇదేనా ? అని తలసాని ప్రశ్నించారు.