ఈటల గెలిస్తే ఏం మేలు జరుగుతుంది?

ఈటల గెలిస్తే ఏం మేలు జరుగుతుంది?

హుజూరాబాద్: సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఎనలేని విశ్వాసం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జనాలకు ఎవరి వల్ల మేలు జరిగిందన్నది ముఖ్యమని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయొచ్చన్నారు. హుజూర్‌బాద్ బైపోల్ ప్రచారంలో పాల్గొన్న తలసాని.. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలని కేసీఆర్ ఆలోచించారన్నారు. 

సాగర్‌లో పెద్దోడైన జానారెడ్డిపై భగత్ గెలవలేదా?

‘మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రమంతా తాగునీరు ఇస్తున్నాం. ఇలాంటివి ఎన్నో చేసాం. ప్రతిపక్ష నాయకులు కూడా హుజూరాబాద్‌‌కు ఏదైనా చేసి మాట్లాడాలి. బండి సంజయ్ నియోజకవర్గంలోనే హుజూరాబాద్ కూడా ఉంది. ఆయన నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాడనుకుంటే రెండున్నరేళ్లుగా ఏమీ చేయలేదు. ఎన్నికల్లో మమ్మల్ని తిట్టడానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈటల పెద్దోడట.. గెల్లు శ్రీనివాస్ చిన్నోడట. నాగార్జున సాగర్‌‌లో జానారెడ్డి పెద్దోడే.. కానీ నోముల భగత్ చేతిలో ఓడిపోలేదా? కేసీఆర్ పై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. రైతు బంధు పెట్టినప్పుడు ఓకే అన్న ఈటల.. ఇప్పుడు దళిత బంధు  రాంగ్ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలదనేది ఆలోచించాలి’ అని తలసాని అన్నారు. 

దళిత బంధులో సగం కేంద్రం భరిస్తుందా?

‘తెలంగాణ వచ్చాక లక్షా 14 వేల ఉద్యోగాలు టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇచ్చాం. పరోక్షంగా  లక్షలాది మందికి ఉపాధి దొరికింది. కుల వృత్తుల కోసం కూడా ప్రభుత్వం సాయం అందించింది. 33 జిల్లాల ఏర్పాటు తర్వాత.. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఖాళీలు గుర్తించాం. ఒక అసెంబ్లీ ఎన్నికల కోసం ఏది పడితే అది చెప్పం. నిరుద్యోగం ఉంది. కానీ ఎన్ని ఉద్యోగాలు ఉండాలో అంతే ఉంటాయి. గత ప్రభుత్వాలు 15 వేలకు మంచి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వలేదు. దళితులను ఇప్పటిదాకా చిన్నచూపు చూపుస్తున్నారు. అలాంటి వారికి ఏదైనా చేయాలని సీఎం ఆలోచించారు. గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించేవారు. మేం మాత్రం నూటికి నూరు శాతం ఖర్చు చేస్తామని.. లేకుంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తామని సీఎం చెప్పారు. దీనిపై మాట్లాడడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఏం అర్హత ఉంది? మీకు ధైర్యం ఉంటే దళిత బంధులో సగం భరించమని కేంద్రంతో చెప్పించండి’ అని తలసాని శ్రీనివాస్ సవాల్ చేశారు. 

ఈటల గెలిస్తే ఏం మేలు జరుగుతుంది?

‘ఈ జనం ఓటేస్తే గెలిచిన బండి సంజయ్‌‌కు బాధ్యత లేదా? కరోనా సమయంలో కూడా గింజతో సహా సీఎం కొనలేదా? ఈటల గెలిస్తే ఏం మేలు జరుగుతుంది. గెలిచిన తర్వాత ఈటలను వెళ్లి పనుల కోసం అడిగితే.. నా చేతిలో ఏముందంటాడు. దీని కోసం ఆయనను గెలిపించాలా? గెళ్లు శ్రీనివాస్ ఉద్యమకారుడు కాదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆయన చాలా పెద్దోడట. ఉద్యమ సమయంలో ఈటలకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు. అంతేగాక ఫైనాన్స్ మంత్రి, ఆరోగ్య మంత్రి ఇచ్చారు. కాబట్టి ఈటల పెద్దోడే. కానీ జానారెడ్డి పెద్దోడే అయినా.. నోముల భగతే గెలిచాడు. గెల్లు శ్రీనివాస్ కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు’ అని తలసాని జోస్యం పలికారు. 

మరిన్ని వార్తల కోసం:

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కోర్టుకెళ్లిన సమంత

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

డ్రగ్స్ తీసుకునేవాళ్లు గోవాకు రావొద్దు: మనోహర్ అజ్గోంకర్