V6 News

ఎల్నినో ఎఫెక్ట్.. వర్షపాతం తగ్గే అవకాశాలు..వానాకాలంలో ముందస్తు సాగుకు ప్లాన్ చేయాలి :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఎల్నినో ఎఫెక్ట్.. వర్షపాతం తగ్గే అవకాశాలు..వానాకాలంలో ముందస్తు సాగుకు ప్లాన్ చేయాలి :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • డిమాండ్  ఉన్న సన్న వరి రకాలను ఎంపిక చేయాలి
  • ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్, వెలుగు:  ఎల్‌నినో ప్రభావంతో వచ్చే సీజన్​లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో సాధారణానికి తగ్గ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచించడంతో మంత్రి సమావేశం నిర్వహించారు. మే 15 నాటికి ఖచ్చితమైన వాతావరణ నివేదికను సేకరించి, జిల్లాల వారీగా వర్షపాతం అంచనాల ఆధారంగా రైతులు సాగు చేయాల్సిన పంటలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. రైతులకు ముందుగానే స్పష్టమైన మార్గదర్శకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సన్న వరి రకాల ఎంపికలో మార్పులు

రాష్ట్రంలో సాగు చేసే సన్న వరి రకాల ఎంపికలో మార్పులు అవసరమని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలనే రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులు మార్కెట్లో అమ్మినప్పుడు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ లాభం పొందేలా విత్తనాల ఎంపిక చేయాలని సూచించారు. ఈ అంశంపై మిల్లర్లు, ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. 

పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి

రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, నూనె గింజల సాగు విస్తీర్ణం కొన్నేళ్లుగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2013-–14తో పోలిస్తే వరి సాగు 131.7 శాతం పెరిగినప్పటికీ, పెసర్లు 75.2 శాతం, మినుములు 71.5 శాతం తగ్గగా మొత్తం పప్పుధాన్యాల సాగు 39 శాతం పడిపోయాయనిట్టు వివరించారు.

ఉలవలు, సజ్జలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం, వేరుశనగ వంటి పంటల సాగు గణనీయంగా తగ్గినట్టు చెప్పారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పంటల సాగును పెంచేలా వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ వర్సిటీ కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎరువుల ధరలపై కేంద్రంపై విమర్శలు

రైతులు అధికంగా యూరియా వినియోగిస్తున్నారని మంత్రి అన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు యూరియాకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఎరువుల ధరలను సమతుల్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు మార్లు కోరినా స్పందన లేదని విమర్శించారు.

రైతులకు అనుకూల విధానాలపై దృష్టి

సివిల్ సప్లై శాఖ సమర్పించిన ధాన్యం కొనుగోలు వివరాలను పరిశీలించిన మంత్రి, వచ్చే సీజన్‌లో అవసరమైన ధాన్యం పరిమాణంపై ముందస్తు అంచనాలు వేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, అగ్రికల్చర్​ సెక్రటరీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్  వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య, వాతావరణ అధికారులు పాల్గొన్నారు.