- రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: మిల్లర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం ఆయన సెక్రటేరియెట్‌లో రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వరి రకాలపై ఆరా తీశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగును ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా మార్కెట్ అవసరాలకు తగ్గ వరి రకాల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సన్న రకాల ఎంపికను శాస్త్రీయంగా చేయాలని ఆదేశించారు. అనంతరం సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం సేకరిస్తున్న వడ్లతోపాటు ప్రైవేట్ సేకరణ, ఎగుమతులకు అనువైన రకాల సాగును ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ఎంటీయూ1010, కేఎన్ఎం 118, ఐఆర్64 వంటి రకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, పొడవైన గింజలున్న రకాల ఎగుమతులు ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి రకాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో సన్న రకాలుగా పరిగణించే కొన్ని వరి రకాలు ఎఫ్‌సీఏ గ్రేడ్–ఎ పరిధిలోకి రావడం లేదని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత వానాకాలానికి ఎంపిక చేసిన 8 రకాలలో 2 రకాలు మిల్లింగ్‌కు అనుకూలంగా లేవని శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కమిషనర్గోపీ, సీడ్డెవలప్మెంట్కార్పొరేషన్ చైర్మన్అన్వేశ్రెడ్డి పాల్గొన్నారు.
