మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌‌ఎస్‌‌ లో చేర్చండి..కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ కు మంత్రి తుమ్మల మరో లేఖ

మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌‌ఎస్‌‌ లో చేర్చండి..కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ కు మంత్రి తుమ్మల మరో లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ధర మద్దతు పథకం (పీఎస్ఎస్)లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సోమవారం లెటర్ రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌లో పండించిన శనగ, పొద్దుతిరుగుడు పంటలపై కేంద్రం విధించిన 25 శాతం మాత్రమే కొనుగోలు చేయాలనే పరిమితులను తక్షణమే ఎత్తివేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఈ పరిమితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం పెరుగుతోందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర అనుమతి మేరకు శనగ పంటను 29,860  టన్నులు, పొద్దుతిరుగుడు పంటను 3,690  టన్నుల వరకు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే  కేంద్రం విధించిన ఈ పరిమితి ఇప్పటికే పూర్తైపోయిందని, కానీ రైతుల వద్ద ఇంకా పంట దిగుబడులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శనగ కొనుగోలు పరిమితిని 1,12,077 టన్నులకు, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను 10,839 టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్రంలో విస్తృతంగా సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పంటలను  పీఎస్‌‌ఎస్‌‌లో చేర్చి కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేపట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ యాసంగి సీజన్‌‌లో 11.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి ఎకరానికి 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. జొన్న పంట 3.68 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఎకరానికి సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశారు.

మార్కెట్లో ధరలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత రబీ సీజన్‌‌లో దాదాపు 3.99 లక్షల  టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గత వానకాలం సీజన్‌‌లో కూడా 3.76 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం చేసినట్లు గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని మొక్కజొన్నకు 14.89 లక్షల టన్నులు, జొన్నకు 2.76 లక్షల  టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో రైతులకు మద్దతు ధర హామీ కల్పించడంతో పాటు తక్కువ ధరలకు అమ్మకాలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.