
- ఆర్డర్లు ఇచ్చి పైసలు ఇవ్వకుండా నేతన్నలను ఆగం చేశారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- శాశ్వత పరిష్కారం కోసం కొత్త పథకం తెస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేనేత రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, కాంగ్రెస్ సర్కారు వచ్చాకే నేతన్నలకు దీర్ఘకాలికంగా లబ్ధి కలిగేలా పథకాలు చేపడుతోందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 2024–25 ఏడాదికి కేటాయించిన రూ.400 కోట్ల బడ్జెట్ ను వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు.
సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ ‘దొంగే.. దొంగ దొంగ’ అని అన్నట్టు ఉందని ఆయన ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో చేనేత రంగాన్ని అస్తవ్యస్తం చేసి, సొంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లెటర్ పేరుతో రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. 2018లో పవర్ లూమ్ కార్మి కులకు ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం(10% యార్న్సబ్సిడీ) తీసుకువచ్చి నిధులు విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా క ఇప్పటివరకు రూ.33.23 కోట్ల నిధులను నేత కార్మికులకు సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుంచి విడుదల చేశామన్నారు.