హైదరాబాద్, వెలుగు: పంటల కొనుగోళ్లలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం సెక్రటేరియెట్లో మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ప్రధాన పంటలన్నింటినీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయని జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో పారదర్శకతతో పాటు రైతుల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిమితులతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక భారం భరిస్తూ మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను సేకరిస్తోందన్నారు.
రైతులు మార్కెట్‌లో ధరల ప్రభావంతో నష్టపోకూడదని ఏటా రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటనలకే పరిమితమైందని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా పంటల దిగుబడులు 150 శాతం వరకు పెరిగినా.. కేంద్రం ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేయాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేదని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్న, మొక్కజొన్న కొంటున్నం
కేంద్ర పరిమితులకు మించి రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్లు చేపడుతోందని మంత్రి తుమ్మల చెప్పారు. 2023–24లో రూ.299 కోట్లతో 93,900 టన్నుల జొన్నలు, 2024–25లో రూ.521 కోట్లతో 1.54 లక్షల టన్నుల జొన్నలు కొనుగోలు చేశామని చెప్పారు. 2025–26 వానాకాలంలో రూ.903 కోట్లతో 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న, యాసంగిలో ఇప్పటివరకు రూ.1044 కోట్లతో 4.35 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
