- ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- చాప్రాల అభయారణ్యానికీ ప్రమాదం లేకుండా చూడాలని సూచన
- తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి వేగంగా అడుగులు
- ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు నాలుగు ప్రత్యామ్నాయాలు
- వీటిలో ఒకటి పాత మార్గమే
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత ప్రాజెక్టు పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తగిన నివేదికలు, టెక్నికల్ప్రపోజల్స్తో రెడీ కావాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
మహారాష్ట్ర భూభాగంలో ముంపును తగ్గించడంతో పాటు చాప్రాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ముంపు ముప్పు లేకుండా బ్యారేజీ డిజైన్చేయాలని అధికారులను ఆదేశించారు. తప్పని పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలోని భూభాగం ముంపునకు గురైతే పరిహారం చెల్లిస్తామన్నారు. బ్యారేజీకి సంబంధించి పూర్తి నివేదిక, ప్రత్యామ్నాయ అలైన్మెంట్స్, వ్యయానికి తగ్గ ఫలితం, జియోటెక్నికల్ డిటేయిల్స్ వంటి అంశాలన్నింటినీ సిద్ధం చేయాలని, వాటి ఆధారంగా నే చర్చలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
గ్రావిటీ ద్వారానే నీళ్లు
లిఫ్టులు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లికి తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లను తీసుకొచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. గతంలో కాంగ్రెస్హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 22.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా తక్కువ లిఫ్టింగ్‌తో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని గుర్తు చేశారు. కానీ, రీడిజైనింగ్పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 18.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని పక్కనపెట్టిందని ఆరోపించారు.
ఇప్పుడు ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకొచ్చేందుకు నాలుగు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశాయని, వాటిని మరింత సమగ్రంగా తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రతిపాదనలతో భూసేకరణను తగ్గించడం, టన్నెల్ పొడవు, కాలువల పొడవులు తగ్గించేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జియాలాజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను వీలైనంత వేగంగా చేయాలని ఆదేశించారు. దాంతో పాటే కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించే చర్యల్లోనూ వేగం పెంచాలన్నారు. కాగా, నాలుగు అలైన్మెంట్స్కు సంబంధించి శనివారం మరోసారి మంత్రి ఉత్తమ్ రివ్యూ చేయనున్నట్టు తెలిసింది.
ఆ నాలుగు ప్రత్యామ్నాయాలు ఇవే..
తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లింక్ చేయడానికి ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ నాలుగు ప్రతిపాదనలు సిఫార్సు చేసినట్టు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ నాలుగు సిఫార్సులు ఇవే.. మొదటి సిఫార్సు.. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న ఒరిజినల్ అలైన్మెంట్. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ఇప్పటికే 71.5 కిలోమీటర్ల వరకు కాలువ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే.
మైలారం వద్ద చిన్న లిఫ్ట్‌ను నిర్మించి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించాలన్నది అప్పటి ప్రణాళిక. ప్రస్తుత ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటిగా ఉంది.రెండో సిఫార్సు.. ఇప్పటికే ఉన్న కెనాల్ నుంచి తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా జైపూర్వాగులోకి నీళ్లను మళ్లించి.. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీకి తరలిస్తారు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
మూడో సిఫార్సు.. జైపూర్ వాగుకు నీటిని తరలించకుండా మధ్యలో 19 కిలోమీటర్ల పొడవుతో టన్నెల్నిర్మించి సుందిళ్లకు నీటిని తీసుకొస్తారు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తారు. ఈ టన్నెల్ తవ్వే మార్గంలో బొగ్గు బ్లాకులు అడ్డుగా వస్తుండడంతో దీనికి ఇంకో ప్రతిపాదనను రెడీ చేశారు. నాలుగో ప్రతిపాదన.. బొగ్గు బ్లాకులు లేని ప్రాంతం నుంచి టన్నెల్‌ను మళ్లించి సుందిళ్లకు నీటిని తరలించడం. దీంట్లో టన్నెల్ పొడవు 7 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది.
ఈ టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటిని గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలన్నది మరో యోచన. ఈ నాలుగు ప్రతిపాదనలపై సమగ్రమైన అధ్యయనాల తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది.
