- స్విస్ ఇంజినీరింగ్, తెలంగాణ పారిశ్రామిక స్కేల్ జతకడితే కొత్త ఆవిష్కరణలు : మంత్రి శ్రీధర్ బాబు
- ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026పై స్విట్జర్లాండ్ బృందంతో భేటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్విట్జర్లాండ్ కంపెనీలకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు స్విట్జర్లాండ్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెన్ బుడ్లిగర్ ఆర్టియెడా నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్ కు వచ్చింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో స్విస్ డెలిగేషన్‌కు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆతిథ్యమిచ్చారు. సీఎస్ సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, దౌత్య ప్రతినిధులు, నగరానికి చెందిన ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) వ్యాపారులు హాజరయ్యారు. స్విస్ ఇంజినీరింగ్ కచ్చితత్వం, తెలంగాణ పారిశ్రామిక స్కేల్ జతకడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ ఎంపిక కరెక్ట్‌అని స్విస్ స్టేట్ సెక్రటరీ హెలెన్ బుడ్లిగర్ ఆర్టియెడా తెలిపారు.
ఐటీ సంస్థలతో ఎకో టూరిజం ప్రమోషన్
రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఐటీ సంస్థల సాంకేతిక భాగస్వామ్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు, అటవీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో హైలెవల్మీటింగ్జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎకో టూరిజం ప్రాంతాల ప్రచారానికి ఐటీ సంస్థలు ఎలాంటి సాంకేతిక సహకారాన్ని అందించవచ్చనే అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడంపై చర్చించారు.
