ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేయాలి..శాఖ నిధులపై రోడ్ మ్యాప్ ఇవ్వండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేయాలి..శాఖ నిధులపై రోడ్ మ్యాప్ ఇవ్వండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కార్పొరేషన్ భూముల్లో సోలార్ ప్లాంట్లకు ప్లాన్​ చేయాలి
  • అధికారులకు మంత్రి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖను ఆర్థికంగా బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాఖకు నిధులు సమకూర్చే మార్గాలపై పది రోజుల్లో రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ ఇవ్వాలని సూచించారు. ఆదివారం తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఇరిగేషన్ కార్పొరేషన్లపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించి, వాటిని ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దాలని చెప్పారు. రుణాల పునర్వ్యవస్థీకరణ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు పొందే మార్గాలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేషన్లకు ఆదాయం వచ్చే మార్గాలను గుర్తించాలని చెప్పారు.

కార్పొరేషన్ భూముల్లో సోలార్ ప్లాంట్లు.. 

ఇరిగేషన్ కార్పొరేషన్లకు ఉన్న భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి చెప్పారు. అవసరమైతే కార్పొరేషన్లే నేరుగా ప్లాంట్లు పెట్టాలని, 
లేదంటే భూములను లీజుకు ఇచ్చి ఆదాయం పొందాలని సూచించారు. రైతులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఇరిగేషన్ శాఖకు ఆదాయం పెంచే మార్గాలు చూడాలని అధికారులకు తెలిపారు.

వడ్డీ భారం తగ్గించాలి..

ఇరిగేషన్ కార్పొరేషన్లకు సంబంధించిన ఆడిట్‌‌‌‌‌‌‌‌లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని కార్పొరేషన్లు చెల్లిస్తున్న వడ్డీని తగ్గించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గితే ఏటా వందల కోట్ల భారం తగ్గుతుందని తెలిపారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, వడ్డీలు, చెల్లింపుల వివరాలతో ఫైనాన్షియల్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ సిద్ధం చేయాలని సూచించారు. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి చెప్పారు. ఇరిగేషన్ శాఖ ఆస్తుల వివరాలను 15 రోజుల్లో అందించాలని అధికారులను ఆదేశించారు