- మెజార్టీ బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి ఉత్తమ్
- అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
- గాంధీ భవన్లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ సన్నాహక సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చే తీర్పుగా భావించాలన్నారు. బుధవారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ నియోజకవర్గ ఇన్చార్జి హోదాలో మంత్రి ఉత్తమ్ పాల్గొని.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
గత పదేండ్లలో కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం, మోసం, అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తక్కువ మున్సిపాలిటీలను గెలుచుకుందని, ఈసారి మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలని కోరారు. సీనియర్, సిన్సియర్ కార్యకర్తలకు టికెట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ముందుకెళ్లాలి..
నిజామాబాద్జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టంకట్టారని, రాష్ట్రంలో 70 శాతం పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించేలా పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన జీవన్ రెడ్డి..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశంలో పాల్గొనడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే తీవ్ర ఆగ్రహంతో ఆయన బయటకెళ్లి పోయారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఈ సమావేశంలో ఎలా పాల్గొన్నారని ప్రశ్నించారు.
పదేండ్లు బీఆర్ఎస్తో తాను, పార్టీ కార్యకర్తలు పోరాడారని.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలవాలని చర్చించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పదేండ్ల పాటు వేధించిన సంజయ్.. ఇప్పుడు ఇదే పార్టీ మీటింగ్లో పాల్గొనడం చూసి తాను జీర్ణించుకోలేకపోయానని, అందుకే తాను మీటింగ్ నుంచి బయటకు వచ్చానన్నారు.
కాగా, జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ.. ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదని, తాను వేరేపని మీద గాంధీ భవన్కు వచ్చానని చెప్పారు. గురువారం తాను అన్ని విషయాలపై మాట్లాడుతానని తెలిపారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటామని.. సమావేశానికి అందరిని ఆహ్వానించామని చెప్పారు. జీవన్ రెడ్డి మాటలపై గురువారం పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు.
