జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో అంత్య పుష్కరాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్కరాల చివరి రోజు కావడంతో కాళేశ్వర త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలను పురస్కరించుకొని... రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. వీరికి ఆలయ అర్చకులు, అధికారులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో ప్రాణహిత, గోదావరి, సరస్వతి మూడు నదులకు మూడుసార్లు పుష్కరాలు నిర్వహించుకోవడం భక్తుల అదృష్టమని పేర్కొన్నారు. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంత్య పుష్కరాల ఏర్పాట్లను చాలా చక్కగా చేశారని కొనియాడారు.
గత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి... రాబోయే గోదావరి పుష్కరాలను తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసిందని, యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ... పవిత్రమైన కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వచ్చే ఏడాది జరగబోయే మహా పుష్కరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో... ఉత్తరాది కుంభమేళా తరహాలో దేశం గర్వించేలా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం సీఎం ప్రత్యేక నిధులు కేటాయించారని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
