అన్ని రంగాల్లోనూ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ కార్మికులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కార్మికులకు పెన్షన్ స్కీమ్ తెచ్చింది ఘనచరిత్ర కలిగిన కాకా వెంకటస్వామినే అని, ఆయన ఎప్పుడూ కార్మికుల సంక్షేమం కోసమే కృషి చేశారని కొనియాడారు. కార్మికులకు తగిన వేతనాలు (మినిమమ్ వేజేస్) ఇప్పిస్తే ఉత్పత్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను మంత్రి ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకుని వారికి నచ్చజెప్పామని తెలిపారు. ఏటీసీల ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలు (స్కిల్స్) నేర్పిస్తున్నామని, రూ.600 కోట్లను పాలిటెక్నిక్ కాలేజీలకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టామ్ కామ్ (TOMCOM) ద్వారా జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వివేక్ వెల్లడించారు.
